Medigadda: ‘మేడిగడ్డ’లో అత్యంత తీవ్ర లోపాలు


దేశంలోని ప్రమాదకర మూడు డ్యాంలలో అదీ ఒకటి

ముందస్తు భద్రత.. పునరావాస చర్యలకు ఎన్డీఎస్‌ఏ సూచనలు

పార్లమెంట్‌లో జలశక్తి సహాయ మంత్రి చౌధరి వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీలో అత్యంత తీవ్ర లోపాలున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా మూడు డ్యాంలు ప్రమాదకరస్థితిలో ఉండగా.. మొదటి స్థానంలో మేడిగడ్డ.., తర్వాతి స్థానాల్లో ఉత్తర్‌ ప్రదేశ్‌లోని లోయర్‌ ఖజూరీ డ్యాం, ఝార్ఖండ్‌లోని బొకారో బ్యారేజీలు ఉన్నాయని పేర్కొంది. డ్యాం రిహాబిలిటేషన్‌ అండ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్ట్‌(డ్రిప్‌) కార్యక్రమం అమలుపై గురువారం పార్లమెంట్‌లో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర జలశక్తిశాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్‌ చౌధరి సమాధానమిచ్చారు. జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షణ సంస్థ(ఎన్డీఎస్‌ఏ) రూపొందించిన స్పెసిఫైడ్‌ డ్యామ్స్‌ జాతీయ రిజిస్టర్‌(ఎన్‌ఆర్‌ఎస్‌డీ) 2025లో 50 ఏళ్లు

దాటిన 1681 డ్యాంలను నమోదు చేసినట్లు తెలిపారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో చేపట్టిన అధ్యయనానికి సంబంధించిన వివరాలు, రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న డ్రిప్‌ నిధుల కేటాయింపు, వ్యయానికి సంబంధించిన వివరాలను మంత్రి వెల్లడించారు.


మేడిగడ్డ రక్షణకు సూచనలు

2025 వర్షాకాలానికి ముందు, తరువాత చేపట్టిన తనిఖీల తరువాత దేశవ్యాప్తంగా మూడు బ్యారేజీలు ప్రమాదం అంచున ఉన్న జాబితాలో(కేటగిరీ-1) ఉన్నాయి. వీటి విషయంలో తక్షణ భద్రతాచర్యలు, నష్టనివారణ, రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇదే కేటగిరీలో ఉన్న జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో గోదావరిపై నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పరిరక్షణకు ఎన్డీఎస్‌ఏ పలు సూచనలు చేసింది. ఈ బ్యారేజీ పియర్స్‌ 2023 అక్టోబరులో కుంగాయి. తెలంగాణ ప్రభుత్వ వినతి మేరకు ఎన్డీఎస్‌ఏ ఈ బ్యారేజీ నిర్మాణాలు మరింత దెబ్బతినకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొంది.


డ్రిప్‌ రెండో దశలో రాష్ట్రానికి రూ.100 కోట్లు

దేశంలోని పాత డ్యాంల పరిరక్షణ చర్యలకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. డ్యాం సేఫ్టీ చట్టం 2021ని అనుసరించి కేంద్రం రాష్ట్రాల భాగస్వామ్యంతో ఆనకట్టల భద్రత, నిర్వహణ విషయంలో పలు కార్యక్రమాలు చేపడుతోంది. గతేడాది వర్షాకాలానికి ముందు 6524, తరువాత 6553 డ్యాంలకు సంబంధించి పరిశీలన పూర్తిచేసి రాష్ట్రాలు కేంద్రానికి నివేదిక సమర్పించాయి. ఆ మేరకు డ్యాంలను మూడు విభాగాలుగా విభజించారు. మొదటి కేటగిరీలో అత్యంత తీవ్రమైన లోపాలు ఉన్న వాటి వివరాలు, రెండో కేటగిరీలో భారీ లోపాలున్నవి, మూడో కేటగిరీలో చిన్నచిన్న లోపాలు వాటికి సంబంధించి తీసుకోవాల్సిన పరిరక్షణ చర్యలను పేర్కొంది.

  • డ్యాంల పరిరక్షణకు డ్రిప్‌ పథకం కింద కేంద్రం పదేళ్ల వ్యవధితో(2021-2031) కూడిన కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. 19 రాష్ట్రాలకు చెందిన 736 డ్యాంల పునరావాసానికి రూ.10,211 కోట్లు వెచ్చిస్తోంది.
  • డ్రిప్‌-2 కింద పలు ఆర్థిక సంస్థల సహకారంతో రూ.5,107 కోట్లు విడుదల చేసింది. డ్రిప్‌-3 కింద రూ.5,104 కోట్ల కేటాయించింది.
  • డ్రిప్‌-2 కింద గతేడాది డిసెంబరు నాటికి రాష్ట్రాలు రూ.2029 కోట్లు ఖర్చు చేశాయి. ఇదే పథకంలో తెలంగాణ నీటిపారుదలశాఖకు రూ.100 కోట్లు కేటాయించినట్లు కేంద్రం చూపింది.



Source link

Spread the love