ఒక వైపు యుద్ధం వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్ననే మరో నెల రోజులు యుద్ధం జరగవచ్చని చెప్పిన ఆయన, ఇప్పుడు చర్చలకు సిద్ధమని ఇరాన్ నేతలు చెప్పారని తెలిపారు. అయితే ఇప్పటికే ఆలస్యమైందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ నాయకత్వంతో పాటు గగనతల రక్షణ, వాయుసేన, నౌకాదళ వ్యవస్థలన్నీ తుడుచుపెట్టుకుపోయాయని తెలిపారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ లో పోస్టు చేశారు.
ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మంగళవారం ఆ ప్రాంతాల నేతలతో కీలక చర్చలు నిర్వహించారు. ముఖ్యంగా ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్, కువైట్ యువరాజు షేక్ సభా అల్-ఖలీద్ అల్-హమద్ అల్-ముబారక్ అల్-సభాలతో టెలిఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) తెలిపింది.
ఇజ్రాయెల్, అమెరికా – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. యుద్ధ వాతావరణం ప్రభావంతో పౌరవిమానయాన రంగంలో అనిశ్చితి నెలకొని, అనేక దేశాల్లో విమాన రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఘర్షణల కారణంగా కొన్ని ప్రాంతాల్లో విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేయబడటంతో వేలాది మంది ప్రయాణికులు విదేశాల్లోనే నిలిచిపోయారు. ఈ పరిస్థితుల్లో ఆయా దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి అత్యవసర చర్యలు చేపట్టారు.
భారత ప్రభుత్వ సమన్వయంతో ఎయిర్ ఇండియా దుబాయ్ మరియు అబుదాబి నగరాల నుంచి ప్రత్యేక రెస్క్యూ విమానాలను నిర్వహించింది. అత్యవసర ఏర్పాట్లతో నడిపిన ఈ విమానాలు ఇవాళ సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నాయి. ఈ రెండు ప్రత్యేక విమానాల్లో మొత్తం 149 మంది ప్రయాణికులు మరియు సిబ్బంది సురక్షితంగా భారత్‌కు తిరిగి వచ్చారు. స్వదేశానికి క్షేమంగా చేరుకోవడంతో ప్రయాణికులు ఉపశమనం వ్యక్తం చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం మరిన్ని అవసరమైన చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు.
9 మందిని రాజ్యసభకు బీజేపీ నామినేట్ చేసింది. ఆ జాబితాను విడుదల చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు రాజ్యసభకు ఎంపిక చేశారు. ఆయన బిహార్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయనతో పాటు నివేశ్ కుమార్ కూడా ఉన్నారు. అసోం నుంచి తేరాష్ గోవాలా, జోగెన్ మోహన్, హర్యానా నుంచి సంజయ్ భాటియా, ఛతీస్‌గడ్ నుంచి లక్ష్మి వర్మ, ఒడిశా నుంచి మన్మోహన్ సావల్, సుజిత్ కుమార్, పశ్చిమ బెగాల్ రాహుల్ సిన్హా ఉన్నారు.