
హైదరాబాద్: మరికొన్ని రోజుల్లో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం కోసం భాజపా జాతీయ నేతలు రానున్నట్లు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు తెలిపారు. పది రోజుల్లో రెండు భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నట్లు మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో చెప్పారు. ఉత్తర తెలంగాణలో ఒక సభ, దక్షిణ తెలంగాణలో మరొ సభ నిర్వహిస్తామని.. వీటికి పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నట్లు వెల్లడించారు.
అంతకుముందు భాజపా రాష్ట్ర కార్యాలయంలో పలువురు న్యాయవాదులు రామచందర్‌రావు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భాజపా చీఫ్ మాట్లాడుతూ.. బ్రిటీష్ చట్టాలే ఇప్పటి వరకు అయ్యాయని, మోదీ వాటికి చరమగీతం పాడేలా న్యాయ వ్యవస్థలో మార్పులు తెచ్చారని చెప్పారు. బంగారు తెలంగాణ కావాలంటే మేధావి వర్గం అంతా భాజపాలో చేరాలని పిలుపునిచ్చారు. అవినీతి రహిత పాలన అందాలంటే రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం రావాల్సిందేనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.