ప్రజారోగ్య సంరక్షణకు అమిత ప్రాధాన్యమిస్తున్నా
ఫెలోస్ ఇండియా సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి
రోగుల నాడి పట్టడం మరవొద్దని వైద్యులకు సూచన

ఈనాడు, హైదరాబాద్: ‘నేను వైద్యుడిని కాదు. కానీ, సోషల్ డాక్టర్‌ని. సామాజిక రోగాలపై మాట్లాడతా. మీరంతా సమాజాన్ని ప్రభావితం చేసే ప్రత్యేక వర్గం. మీరు మా ప్రాణాలను కాపాడతారని మేమంతా బలంగా నమ్ముతాం. ఈ క్రమంలో మనుషులపై, సమాజంపై మీ బాధ్యతను ఎప్పటికీ మరచిపోవద్దు’’ అని వైద్యులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు.
హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో ఇంటర్నేషనల్ కార్డియాలజీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఫెడరేషన్(ఐసీఆర్‌టీఎఫ్), మెడికవర్ ఆసుపత్రుల ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఫెలోస్ ఇండియా-2026 సదస్సులో శనివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ‘‘ప్రజల ఆరోగ్య సంరక్షణకు మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. వైద్యారోగ్య రంగాల అభివృద్ధికి ఉత్తమ పాలసీల కోసం వైద్యులతో కలిసి పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్‌కేర్ ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచమంతా ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వైపు వేగంగా పరుగులు తీస్తోంది. మీరు కూడా అధునాతన సాంకేతికతను సొంతం చేసుకోవాలి. అదే సమయంలో రోగుల నాడిని పట్టుకోవడం విస్మరించొద్దు. ప్రస్తుతం గుండె జబ్బులు పెరుగుతున్నాóు. వీటిని అరికట్టేందుకు మనమందరం కలిసి కృషి చేయాలి. విద్యార్థులకు సీపీఆర్ నేర్పించేందుకు వైద్యులు స్వచ్ఛందంగా ముందుకొస్తే ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చు. ఇలాంటి సదస్సులు హైదరాబాద్‌లో జరగడం నాకెంతో గర్వంగా ఉంది. మీరంతా విజయవంతమైన కార్డియాలజిస్టులు. అయినా ఎప్పటికప్పుడు మీ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి ఇలాంటి సదస్సులు బాగా ఉపయోగపడతాయి. నిరంతరం నేర్చుకోవడమే అతిపెద్ద విజయ రహస్యం. కొత్త విషయాలను తెలుసుకోవడం, నైపుణ్యాన్ని పెంచుకోవడం మానేస్తే కెరీర్‌కు ముగింపు పలికినట్లే’ అని సీఎం స్పష్టంచేశారు. ఈ సదస్సులో భాగంగా క్లిష్టమైన కరోనరీ యాంజియోప్లాస్టీలు, ఆధునిక వాల్వులర్ ప్రొసీజర్లు, కొత్త వైద్య పరికరాలు, భవిష్యత్ కార్డియాలజీపై వైద్యులు ప్రత్యేక చర్చ నిర్వహించారు. సదస్సులో మెడికవర్ సీఎండీ డాక్టర్ అనిల్‌కృష్ణ, ఆర్గనైజింగ్ ఛైర్మన్ డాక్టర్ ఎన్.ప్రతాప్‌కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ శరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.