తెలంగాణ ప్రభుత్వం బిల్డింగ్ రూల్స్‌లో కీలక సవరణలు చేసింది. ఇకపై 21 మీటర్ల పైబడిన వాటినే హై-రైజ్ భవనాలుగా గుర్తిస్తారు. భారీ నిర్మాణాలకు టీడీఆర్ వినియోగాన్ని తప్పనిసరి చేస్తూనే, రోడ్డు వెడల్పును బట్టి అదనపు అంతస్తుల నిర్మాణానికి వెసులుబాటు కల్పించింది. సెట్‌బ్యాక్ నిబంధనలలో 10 శాతం సడలింపునిచ్చింది. పట్టణాల్లో వర్టికల్ గ్రోత్‌ను ప్రోత్సహించాలని నిర్ణయించింది.
హైలైట్:
- తెలంగాణ బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు
- అదనపు అంతస్తుల నిర్మాణానికి ఛాన్స్
- కొత్త బిల్డింగ్ రూల్స్ ఇవే

10 అంతస్తులకు మించిన భవనాల్లో 10వ అంతస్తు పైబడిన విస్తీర్ణంపై 3 శాతం, అలాగే 20 అంతస్తులు దాటిన భవనాల్లో 20వ అంతస్తు పైబడిన ఏరియాపై 5 శాతం టీడీఆర్ లోడింగ్ ఉండాలి. నిర్మాణ అనుమతి సమయంలోనే 50 శాతం టీడీఆర్ సమర్పించాలి, మిగిలిన 50 శాతాన్ని ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చే లోపు అందజేయాల్సి ఉంటుంది. నగరాల్లో స్థల లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో ‘వర్టికల్ గ్రోత్’ను ప్రోత్సహించేందుకు రోడ్డు వెడల్పు ఆధారంగా అదనపు అంతస్తులకు అనుమతినిచ్చారు.
2000 చ.మీ కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్లలో 40 అడుగుల రోడ్డు ఉంటే 3 అదనపు అంతస్తులు, 60 అడుగుల రోడ్డు ఉంటే 4 అదనపు అంతస్తులు, 80 అడుగుల రోడ్డు ఉంటే 5 అదనపు అంతస్తుల వరకు నిర్మించుకోవచ్చు. భవనాల చుట్టూ వదిలే సెట్‌బ్యాక్ నిబంధనలలో టీడీఆర్ వినియోగం ద్వారా 10 శాతం వరకు సడలింపు పొందే అవకాశం కల్పించారు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా భవనం చుట్టూ కనీసం 7 మీటర్ల సెట్‌బ్యాక్ ఉండాలనే నిబంధనను మాత్రం కచ్చితంగా పాటించాలి. మాస్టర్ ప్లాన్ రోడ్ల మార్పులు జరిగినప్పుడు కన్వర్షన్ ఛార్జీలు చెల్లించి, దానికి సమానమైన టీడీఆర్‌ను సమర్పించే వెసులుబాటు కూడా కల్పించారు.
