Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన


తెలంగాణ తాజా వార్తలు: మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు ప్రత్యేక పథకాల ద్వారా చేయూత అందిస్తున్నదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు. ఈ క్రమంలో వడ్డీ లేని రుణాల పథకం కింద పట్టణ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాల పంపిణీతోపాటు ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, మెప్మా అధికారులు, బ్యాంకు అధికారులతో వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పట్టణ మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, అర్హులైన సంఘ సభ్యులకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి నిర్దిష్ట కాలవ్యవధిలో పూర్తి చేయాలని తెలిపారు. మహిళా సంఘాలలో సభ్యులు కాని అర్హులైన వారిని రేషన్ కార్డు ఆధారంగా గుర్తించాలని, పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి రద్దీ ఏర్పడకుండా సక్రమ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ రాజార్షి షా మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణ స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి, అన్ని శాఖల అధికారుల సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, డిఆర్డివో రవీందర్, మున్సిపల్ కమిషనర్ రాజు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అంతకు ముందు మధిర మున్సిపాలిటీ పరిధిలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడి ఆయన… “అసాధ్యం అన్నది సాధ్యం చేసి చూపడమే మా ప్రభుత్వ లక్ష్యం. పేద, మధ్యతరగతి మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఎంతటి భారాన్నైనా మోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తొలి ఏడాదిలోనే లక్ష్యాన్ని మించి రూ. 26 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశాం. రుణాలతో పాటు శిక్షణ అందించి, మహిళలను చిన్న–మధ్య తరహా పరిశ్రమల వైపు నడిపిస్తూ వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నాం. క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సుల లీజులు, పెట్రోల్ బంకుల యాజమాన్యం మహిళా సంఘాలకే అప్పగించాం. ఇందిరా మహిళా డెయిరీలో మహిళలే వాటాదారులు. పాలు నుంచి అనుబంధ ఉత్పత్తుల వరకు అన్ని కార్యకలాపాలు మహిళల చేతులలోనే. మహిళల ఆత్మగౌరవం, ఆర్థిక బలం, సమాన అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.” అని తెలిపారు.

ఇంకా చదవండి





Source link

Spread the love