తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు నిర్వహించనున్నారు. అదే సమయంలో ప్రజా ప్రతినిధులకు సాంస్కృతి కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. ఈ నెల 28, 29 రోజుల్లో ఈ ఆటల పోటీలు ఎల్బీ స్టేడియంలో.. సాంస్కృతిక కార్యక్రమాలను రవీంద్ర భారతిలో నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కమిటీని కూడా ఏర్పాటు చేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆటల పోటీలు ఇదే తొలిసారి కావడం విశేషం.

ఈ నెల 28, 29వ తేదీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. గురువారం శాసనసభలో ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా తొలి విడత లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్–2026 నిర్వహించనున్నట్లు తెలిపారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కమిటీ ఛైర్మన్‌గా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు.. కో ఛైర్మన్‌గా క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని నియమించారు. అదే సమయంలో రవీంద్ర భారతిలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇలాంటి ఆటల పోటీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిర్వహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ కమిటీకి కన్వీనర్‌గా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సహా మరో 13 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. గురువారం అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమైన ఈ కమిటీ.. ప్రజా ప్రతినిధులకు నిర్వహించనున్న పోటీల నిర్వహణపై సమీక్ష చేపట్టింది. ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం 3:30 గంటలకు ఎల్బీ స్టేడియంలో క్రీడలు ప్రారంభం కానున్నట్లు కమిటీ స్పష్టం చేసింది.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించడంతోపాటు.. రాష్ట్ర ప్రజల్లో క్రీడా స్ఫూర్తిని నింపడం కోసమే ఈ ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు స్పోర్ట్స్ కమిటీ ఛైర్మన్, మంత్రి జూపల్లి కృష్ణారావు.. కో ఛైర్మన్ మంత్రి వాకిటి శ్రీహరి తేల్చి చెప్పారు. అంతకుముందు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిసిన మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి స్పోర్ట్స్ కిట్‌ను అందించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు.. ఈ నెల 28, 29వ తేదీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మొదటి ఎడిషన్ లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్–2026 ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రవీంద్ర భారతిలో సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
