
తాడ్వాయి: మేడారం మహాజాతరను విజయవంతంగా నిర్వహించి, వనదేవతలు సమ్మక్క, సారలమ్మ వైభవాన్ని ప్రపంచానికి చాటుతామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు జరిగే ఉత్సవాల ఏర్పాట్లు, గద్దెల పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు ఆదివారం రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి సీతక్క, దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి మేడారం సందర్శించారు. స్థానిక హరిత హోటల్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ముందుగా మీడియాతో మాట్లాడారు. ఈ ఉత్సవాలు ఆదివాసీలతో పాటు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. అందుకే రూ.251 కోట్లు వెచ్చించి శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు. మరో రెండు రోజుల్లో అభివృద్ధి పనులన్నీ పూర్తవుతాయని, మహా జాతరను దేశం గర్వించేలా నిర్వహిస్తామన్నారు. సమావేశంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తదితరులున్నారు. అనంతరం వనదేవతలను దర్శించుకొని పూజలు చేశారు. గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.