
నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో వానరాలకు ఆహార సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మెదక్-హైదరాబాద్ జాతీయ రహదారి (795-డి)పై నర్సాపూర్ అటవీ మార్గంలో ప్రయాణికులు, వాహన చోదకులు వేసే ఆహారం కోసం వందల సంఖ్యలో కోతులు రోడ్డుకు ఇరువైపులా వేచి చూస్తుంటాయి. ఈ సమయంలో అవి ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడుతున్నాయి. వాహనాలకు అవి అడ్డొస్తుండగా.. ప్రజలూ ప్రమాదాలకు గురవుతున్నారు.
ఈ నేపథ్యంలో అటవీశాఖ సహకారంతో ఓ సంస్థ మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ ప్రాంతంలోని అర్బన్ పార్కు వద్ద కోతుల ఆహార సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలో ఆహార దాతలు, సందర్శకులు అందించే ఆహారాన్ని సేకరించి వానరాలకు చేరవేస్తున్నారు. కోతులు తిరిగి అడవి లోపలికి వెళ్లేలా చేయడమే దీని ఉద్దేశం. ఈ మేరకు వాటి సహజ ఆవాసాలను తిరిగి సృష్టించి.. అక్కడ అవి స్వేచ్ఛగా జీవించేలా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సమీపంలో ఏడాదంతా ఆహారం అందేలా 21 రకాల విభిన్న అటవీ ఫల వృక్షాలనూ పెంచుతున్నారు. (తెలంగాణ వార్తలు)