Telangana SPF: తెలంగాణ ఎస్‌పీఎఫ్‌ సంక్షేమానికి కీలక నిర్ణయం.. ప్రత్యేక ప్యాకేజీపై ఒప్పందం


హైదరాబాద్‌: రాష్ట్ర భద్రత కోసం అహర్నిశలు పనిచేస్తున్న తెలంగాణ ప్రత్యేక రక్షణ దళం (TGSPF) సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిబ్బందితోపాటు వారి కుటుంబాలకు సంపూర్ణ భద్రత కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ఎస్‌పీఎఫ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. సికింద్రాబాద్ రాణిగంజ్‌లోని బుద్ధభవన్‌లో ఉన్న ఎస్‌పీఎఫ్ ప్రధాన కార్యాలయంలో ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందం ద్వారా ఎస్‌పీఎఫ్ సిబ్బందికి ప్రత్యేకంగా రూపొందించిన పోలీస్ శాలరీ ప్యాకేజీ అమలులోకి రానుంది.

ఎస్‌పీఎఫ్ సిబ్బంది ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.కోటి వరకు వ్యక్తిగత ప్రమాద బీమా అందనుంది. విమాన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతే రూ.1.60 కోట్ల వరకు పరిహారం లభిస్తుంది. ప్రమాదాల్లో శాశ్వత వైకల్యం సంభవించినా రూ.80 లక్షల వరకు ఆర్థిక సాయం అందేలా ఏర్పాట్లు చేశారు. సిబ్బందితో పాటు వారి పిల్లల భవిష్యత్తుపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. విధి నిర్వహణలో సిబ్బంది మరణిస్తే.. వారి కుమారుడు లేదా కుమార్తె ఉన్నత విద్య కోసం రూ.28 లక్షల వరకు ఆర్థిక సాయం అందనుంది. ఇద్దరు కుమార్తెల వరకు వివాహ ఖర్చుల కోసం రూ.10 లక్షల వరకు ప్రత్యేక సాయం కల్పించనున్నారు.



Source link

Spread the love