మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రేవంత్ రెడ్డి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి మహిళలు బస్సుల్లో ప్రయాణించేటపుడు ఆధార్ కార్డులు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. మహిళలకు చిప్‌తో కూడిన స్మార్ట్ కార్డులను జారీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు.. ఉచిత బస్సు పథకం ద్వారా తెలంగాణ సర్కార్ మరో కొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటివరకు 290 కోట్లకు పైగా జీరో టికెట్లను ఆర్టీసీ మహిళలకు జారీ చేయగా.. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లు ఖర్చు చేసింది.

ఇక ఈ విషయాన్ని టీజీఎస్ఆర్టీసీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే అంటే.. 2023 డిసెంబర్ 9వ తేదీన ఈ ఉచిత బస్సు పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకం.. ప్రస్తుత మార్చి 29వ తేదీ నాటికి 290 కోట్లకు పైగా జీరో టికెట్లను మహిళలకు జారీ చేశారని.. ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10,000 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.
మరోవైపు.. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి. గతంలో మహిళల ప్రయాణాలు 40 శాతంగా ఉండగా.. ఇప్పుడు అది 67 శాతానికిపైగా పెరిగినట్లు చెప్పాయి. నిత్యం సగటున 35 లక్షల మందికిపైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని గణాంకాలతో సహా వివరించారు.
ఉద్యోగ, ఉపాధి, విద్య అవకాశాల కోసం రాష్ట్రంలోని మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. మరోవైపు.. గ్రామాల నుంచి నాణ్యమైన వైద్యం కోసం మహిళలలు ఆస్పత్రుల కోసం హైదరాబాద్ నగరానికి కూడా వస్తుండటం గమనార్హం. మరోవైపు.. కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్రంలో ఉన్న పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతీసారి మహిళలు బస్సుల్లో ప్రయాణించేటపుడు ఉచిత ప్రయాణం కోసం.. ఆధార్ కార్డును పట్టుకుపోవడం అలవాటుగా మారింది. అయితే మహిళలకు మరింత సౌకర్యంగా ఉండేందుకు మహాలక్ష్మి పథకం కోసం త్వరలోనే చిప్ ఆధారిత స్మార్ట్ కార్డులను జారీ చేయనున్నట్లు తాజాగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి స్పష్టం చేశారు.
చిప్ ఆధారిత స్మార్ట్ కార్డులు అందుబాటులోకి వచ్చిన తర్వాత మహిళలు.. ఆధార్ కార్డు చూపించాల్సిన అవసరం లేకుండా.. కేవలం స్మార్ట్ కార్డులు చూపించి ఉచితంగా బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని చెబుతున్నారు. బస్సుల్లో పెరిగిన మహిళల రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను ప్రవేశపెడుతున్నట్లు ఎండీ నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఇక జీరో టికెట్లను ఆర్టీసీ మహిళలకు జారీ చేస్తుండగా.. వాటికి సంబంధించిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్మెంట్ రూపంలో టీజీఎస్ఆర్టీసీకి చెల్లిస్తోంది. ఇలా చేయడం వల్ల కూడా ఆర్టీసీకి ఆదాయం పెరుగుతుంది.
