అమెరికా ప్రభుత్వం షట్ డౌన్‌లోకి వెళ్లింది. అధికార రిపబ్లికన్లు ప్రతిపాదించిన తాత్కాలిక నిధుల ప్యాకేజీని ప్రతిపక్ష డెమొక్రాట్లు అడ్డుకోవడంతో ఈ పరిస్థితి. అమెరికా ప్రభుత్వ షట్ డౌన్ కారణంగా 7.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రభావం పడనుంది. వీరి జీతాలు ఆగిపోనున్నాయి. సైన్యం సహా ఎమర్జెన్సీ ఉద్యోగాలు చేసేవారు జీతాలు తీసుకోకుండానే పనిచేయాల్సి ఉంటుంది. అయితే గత 6 ఏళ్లలో షట్ డౌన్ కావడం ఇదే తొలిసారి అని సంబంధిత వర్గాలు ఉన్నాయి.

ప్రభుత్వం ముగిసింది.. తాత్కాలిక నిధుల ప్యాకేజీకి ఆమోదం లభించక షట్ డౌన్ ఏర్పడినప్పుడు.. చట్టం ప్రకారం ఫెడరల్ ఏజెన్సీలు తమ కార్యకలాపాలను నిలిపివేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో ప్రభుత్వ సిబ్బందిని అత్యవసర ఉద్యోగులు, అత్యవసరం కాని ఉద్యోగులు అని రెండు వర్గాలకు విభజిస్తారు. ప్రజల ప్రాణాలను, ఆస్తులను రక్షించే వ్యవస్థల్లో పనిచేసేవారు సైనిక సిబ్బంది, వైద్య సిబ్బంది, సరిహద్దు రక్షణ, పోలీస్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, సోషల్ సెక్యూరిటీ చెక్కుల పంపిణీ వంటి సేవలు కొనసాగుతాయి. అయితే ఈ వ్యవస్థల్లో పనిచేసే వారు షట్ డౌన్ సమయంలో ఉద్యోగాలు చేయవలసి ఉంటుంది.. కానీ షట్ డౌన్ ముగిసేవరకు వారికి జీతం ఇవ్వరు. ఆ తర్వాతే బకాయిలు చెల్లిస్తారు.
ఇక అత్యవసరం కాని ఉద్యోగులకు తాత్కాలికంగా వేతనం లేని సెలవును ఇస్తారు. కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ అంచనాల ప్రకారం.. దాదాపు 7.50 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులు తాత్కాలికంగా జీతం కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. షట్ డౌన్ వల్ల అనేక కీలక ప్రభుత్వ సేవలు నిలిచిపోతున్నాయి. అందులో ఫెడరల్ ఫుడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్‌లు, ఫుడ్ ఇన్‌స్పెక్షన్లు, ప్రభుత్వ ప్రీ-స్కూల్స్, స్టూడెంట్ లోన్స్, ఇమ్మిగ్రేషన్ విచారణలు, నేషనల్ పార్కులు పూర్తిగా నిర్వహించడం లేదా తక్కువ సంఖ్యలో సేవలు అందించడం జరుగుతుంది.
అత్యవసర సేవలతో పాటు సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ చెక్కల పంపిణీ.. నాసా అంతరిక్ష మిషన్లు.. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ కార్యకలాపాలు.. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌లో కొన్ని ప్రజా ఆరోగ్య పనులు కొనసాగుతున్నాయి. అయితే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పరిస్థితికి మరింత ఆజ్యం పోశారు. షట్ డౌన్ జరిగితే.. తన పాలనలో చాలా మంది ఫెడరల్ ఉద్యోగులను శాశ్వతంగా తొలగిస్తున్నారని.. వారు ఎక్కువగా డెమొక్రాట్లు అయి ఉంటారని ఆయన చేసిన హెచ్చరికలు ఇప్పుడు అమెరికాలో సంచలనం సృష్టిస్తున్నాయి.
సుదీర్ఘ కాలం షట్ డౌన్ కొనసాగడం వల్ల మార్కెట్లు పడిపోవడం మాత్రమే కాకుండా.. ప్రజా విశ్వాసం దెబ్బతింటుంది. షట్‌డౌన్‌ను కొనసాగిస్తున్న ప్రతి వారానికి ఆర్థిక వృద్ధి 0.1 నుంచి 0.2 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈసారి నిధుల వివాదంలో ఆరోగ్య సంరక్షణ సమస్య ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ సబ్సిడీలు ముగిస్తే.. దాదాపు 2.4 కోట్ల మంది అమెరికన్లకు ఆరోగ్య సంరక్షణ ఖర్చులు ఒక్కసారిగా పేరనున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌లో అధికార, విపక్షాల మధ్య రాజీ కుదిరే పరిస్థితులు లేకపోవడంతో.. ఈ షట్ డౌన్ ఎంతకాలం కొనసాగుతుంది అనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.
