
దిల్లీ: తెలంగాణలో పంటలకు ప్రమాదకరంగా పరిణమించిన కోతుల సమస్యను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం శాస్త్రీయంగా చర్యలు చేపట్టాలని భారాస రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కోరారు. దీనిపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి భూపేందర్‌యాదవ్ దృష్టిసారించాలని విజ్ఞప్తిచేశారు. ప్రస్తుతం కొన్ని ఊళ్లలో మనుషుల కంటే కోతులే ఎక్కువ ఉన్నాయని, వాటినుంచి పంటలను కాపాడుకోవడం ఎలాగో తెలియక రైతులు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం రాజ్యసభలో ద్రవ్యవినిమయ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.
‘‘కేసీఆర్ హయాంలో తెలంగాణలో వ్యవసాయానికి స్వర్ణయుగం నడిస్తే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పరిస్థితులు తలకిందులయ్యాయి. ప్రస్తుతం కనీసం యూరియా కూడా సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. రైతులకు అందించాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీలు నెలల తరబడి పెండింగ్‌లో పెడుతున్నారు. దీనివల్ల అన్నదాతలపై ఆర్థిక భారం పెరిగిపోతోంది. రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళికా లేదు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చినా అది పూర్తిగా చేయలేదు. ప్రస్తుతం తెలంగాణలో పంట పొలాలకు కోతుల బెడద విపరీతంగా పెరిగిపోయింది.
అడవుల్లో వాటికి ఆహారం లేకపోవడంతో గుంపులుగా గ్రామాల మీదికొచ్చి పంటలను నాశనం చేస్తున్నాయి. కోతులకు భయపడి ఇప్పుడు రాష్ట్రంలో వరి తప్ప ఇంకే పంట వేయలేని పరిస్థితి వచ్చింది. గత ఎన్నికల్లో కోతుల సమస్య తీర్చినవారికి ఓట్లేస్తామని ప్రజలు ప్రకటించడాన్ని బట్టి ఆ సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను శాస్త్రీయ పద్ధతిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకూ సమ ప్రాధాన్యం ఇచ్చి తెలంగాణలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలి. రైల్వే, జాతీయ రహదారుల అనుసంధానతకు మరిన్ని నిధులు కేటాయించాలి’’ అని రవిచంద్ర కోరారు.